Layoffs | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: టెక్ కంపెనీల్లో గత నాలుగేండ్ల నుంచి అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్న ఉద్యోగ కోతలు (లేఆఫ్‌లు) ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. పునర్వ్యవస్థీకరణతోపాటు ఖర్చులను తగ్గించుకోవడం, పనితీరును మెరుగుపర్చుకోవడంలో భాగంగా ఈ యేడు కూడా కొలువుల్లో భారీగా కోతలు విధించనున్నట్టు ఇప్పటికే పలు అమెరికన్ కంపెనీలు ప్రకటించాయి. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, వాల్‌మార్ట్, సేల్స్‌ఫోర్స్, వర్క్‌డే, స్ట్రైప్ లాంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. వాటిలో కొన్ని కంపెనీలు ఈ ఏడాది జనవరిలోనే 49,795 మంది ఉద్యోగాలను కుదించాయి. ఇది 2024 డిసెంబర్లో తొలగించిన 38,792 ఉద్యోగాల కంటే దాదాపు 28% అధికం.
అమెరికన్ రిటైల్ వ్యాపార దిగ్గజం ‘వాల్‌మార్ట్’ త్వరలో వందలాది ఉద్యోగులను తొలగించడంతోపాటు నార్త్ కరోలినాలోని కార్యాలయాన్ని మూసేయాలని, ప్రస్తుతం అందులో పనిచేస్తున్న సిబ్బందిని ఆర్కాన్సస్, కాలిఫోర్నియాలోని మినీ హబ్‌లకు తరలించాలని నిర్ణయించినట్టు ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ మెమోలో చీఫ్ పీపుల్ ఆఫీసర్ డోనా మోరిస్ స్పష్టం చేశారు. ఇదేవిధంగా త్వరలో దాదాపు 1,750 మంది ఉద్యోగులకు ‘పింక్ స్లిప్పులు’ ఇవ్వనున్నట్టు దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ ‘వర్క్‌డే’ ప్రకటించింది. గత నెల కమ్యూనికేషన్స్ విభాగంలో అమెజాన్ డజన్ల ఉద్యోగాలను తొలగించగా.. అంతర్జాతీయ ఐటీ సంస్థ ‘మైక్రోసాఫ్ట్’ పనితీరు ఆధారంగా ఉద్యోగులపై వేటు వేయడం ప్రారంభించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మొత్తం సిబ్బందిలో 5 శాతం మందిని తొలగించనున్నట్టు గత నెలలో ప్రకటించిన ‘మెటా’, ప్రధానంగా పేలవమైన పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతున్నది. దాదాపు 3,600 మందిపై వేటు పడనున్నది. వీరిలో 3 వేల మందిని సోమవారమే ఇండ్లకు పంపనున్నట్టు ఆ కంపెనీ నుంచి లీకైన ఓ మెమో వెల్లడించింది.
టెక్ దిగ్గజం ‘గూగుల్’ నేరుగా ప్రకటించకపోయినప్పటికీ తన ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ విభాగంలోని ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్, నెస్ట్, ఫిట్‌బిట్ ఉత్పత్తుల సిబ్బందికి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది. త్వరలో ప్రొడక్ట్, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ విభాగాల్లోని దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది.
భారత్‌లోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన ‘ఇన్ఫోసిస్’ నిరుడు అక్టోబర్‌లో క్యాంపస్ నియామకాల ద్వారా చేర్చుకున్న 700 మంది ఉద్యోగులను బలవంతంగా గెంటివేసింది. అందుకోసం బౌన్సర్లను, సెక్యూరిటీ గార్డులను ఉపయోగించిందని, ఎలాంటి ముందస్తు నోటీసులు, నష్టపరిహారం ఇవ్వకుండా అన్యాయంగా ఉద్యోగులను తొలగించిందని ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్ఐటీఈఎస్ (నాస్కెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్) ఆరోపించింది. కార్మిక చట్టాలను ఉల్లంఘించడంతోపాటు ఉద్యోగులను బెదిరిస్తున్న ‘ఇన్ఫోసిస్’పై వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది.