Jnanpith Award : హిందీ భాషలో ఎన్నో రచనలు చేసిన ప్రముఖ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు దేశంలోనే అత్యున్నత సాహిత్య గౌరవమైన జ్ఞాన్‌పీఠ్ అవార్డు దక్కింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 88 ఏళ్ల వినోద్ కుమార్ శుక్లా ఎన్నో రచనలు చేశారు. హిందీలో షార్ట్ స్టోరీస్, కవితలు, వ్యాసాలు రాశారు. దేశంలోని ప్రముఖ హిందీ రచయితల్లో ఒకరైన ఆయన సాహిత్య రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ ఉన్నత పురస్కారం దక్కింది.
వినోద్ కుమార్ శుక్లాను జ్ఞాన్‌పీఠ్ అవార్డుకు ఎంపిక చేస్తున్నట్లు శనివారం సాయంత్రం ప్రకటించారు. శుక్లా అందుకోబోతున్నది 59వ జ్ఞాన్‌పీఠ్ పురస్కారం. ఇప్పటికే ఈ అవార్డును 58 మంది అందుకున్నారు. అయితే జ్ఞాన్‌పీఠ్ పురస్కారం అందుకున్న ఛత్తీస్‌గఢ్ తొలి రచయితగా వినోద్ కుమార్ శుక్లా గుర్తింపు పొందారు. అదేవిధంగా హిందీ భాషలో ఈ అవార్డు అందుకున్న 12వ రచయితగా నిలిచారు.
ప్రఖ్యాత స్టోరీ టెల్లర్, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత ప్రతిభా రే నేతృత్వంలోని జ్ఞాన్‌పీఠ్ సెలెక్షన్ కమిటీ సమావేశంలో వినోద్ కుమార్ శుక్లాను అవార్డుకు ఎంపిక చేశారు. జ్ఞాన్‌పీఠ్ పురస్కారంతోపాటు రూ.11 లక్షల నగదును, సరస్వతీదేవి కాంస్య విగ్రహాన్ని అందజేస్తారు. వినోద్ కుమార్ శుక్లా 1999లో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు.