J&K congress chief : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగాను 42 స్థానాల్లో గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీకి కాంగ్రెస్ (Congress) మద్దతు ప్రకటించింది. ఈ మేరకు జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా.. నేషనల్ కాన్ఫరెన్స్ కీలక నేత ఒమర్ అబ్దుల్లాకు లేఖ అందజేశారు.
అంతముందు జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి మద్దతు తెలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం తీర్మానం కాపీని పార్టీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్‌కు ఇచ్చారు. ఆయన శ్రీనగర్‌లో ఒమర్ అబ్దుల్లాను కలిసి ఆ తీర్మానం కాపీని అందజేశారు.
తాజా పరిణామాల నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా రేపు లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను తెలిపే అవకాశం ఉంది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానం మేరకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో ఏకైక స్థానం గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్సీకే తన మద్దతు తెలిపింది.