Jharkhand | రాంచీ, జనవరి 6: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని హేమంత్ సొరేన్ సర్కార్ నెలరోజుల్లోనే నిలబెట్టుకుంది. మహిళలకు నగదు సాయం కింద నెలకు రూ.2,500 అందజేసే ‘మాయీ సమ్మాన్ యోజన’ పథకాన్ని సొరేన్ సర్కార్ సోమవారం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులైన 56.61 లక్షల మంది మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.1,415 కోట్లను బదిలీ చేసింది. 2024 నవంబర్ 28న ఏర్పడ్డ సొరెన్ సర్కార్, నెలరోజుల్లో పథకాన్ని అమలుజేసేందుకు (డిసెంబర్ 28న) ఏర్పాట్లు చేసింది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ కన్నుమూయటంతో ‘మాయీ సమ్మాన్’ జనవరి 6కి వాయిదా పడింది.
ఇక మన దగ్గర తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రతినెలా ‘మహిళలకు రూ.2,500’ ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలును అటకెక్కించింది. 100 రోజుల్లో వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని చెప్పిన కాంగ్రెస్.. 13 నెలలైనా పథకం ఊసెత్తటం లేదు. కాగా, జార్ఖండ్‌లో మహిళలకు రూ.2,500 పథకాన్ని ప్రారంభిస్తూ, తాము ఎన్నికల నినాదాలకు మాత్రమే పరిమితం కాలేదని సీఎం హేమంత్ సొరేన్ అన్నారు. ఎన్నికల కోసం మోసపూరిత వాగ్దానాలు చేయలేదని అన్నారు.
జార్ఖండ్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకో: హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): జార్ఖండ్‌లోని జేఎంఎం ప్రభుత్వాన్ని చూసి కాంగ్రెస్ సర్కార్ బుద్ధి తెచ్చుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు హితవు పలికారు. మహాలక్ష్మి పథకం ఎందుకు అమలు చేయడం లేదని సోమవారం ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2024 నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేసిన జార్ఖండ్ జేఎంఎం ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే మాట నిలబెట్టకున్నారని అన్నారు. ‘మాయీ సమ్మాన్’ పథకం కింద నెలకు మహిళలకు రూ.2,500 ఇస్తున్నారని అన్నారు. కానీ 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన 125 ఏళ్ల పార్టీకి చెందిన తెలంగాణ సీఎం ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 13 నెలలైనా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పిన మొట్టమొదటి పథకాన్నే ఎందుకు పక్కకు పెట్టారు? అని నిలదీశారు. కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్‌కి ఇది షేమ్ అంటూ ట్వీట్ చేశారు.