రాంచీ: రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి జార్ఖండ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదు అయిన నేరాభియోగ పరువునష్టం కేసును కొట్టివేయాలని రాహుల్ గాంధీ పెట్టుకున్న అభ్యర్థనను జార్ఖండ్ హైకోర్టు తిరస్కరించింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఓ హత్య కేసులో నిందితుడని గతంలో రాహుల్ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. ఆ ఘటనలో రాహుల్‌పై క్రమినల్ డిఫమేషన్ కేసు బుక్ చేశారు. ట్రయల్ కోర్టులో ఆ కేసు విచారణ జరుగుతున్నది.
జస్టిస్ అంబుజనాథ్ ఈకేసును విచారించారు. రాహుల్ గాంధీ తరపున అడ్వకేట్ పీయూష్ చిత్రేశ్, దీపాంకర్ రాయ్‌లు వాదించారు. ఫిబ్రవరి 16వ తేదీన రాహుల్ గాంధీ రాసిన లేఖను కోర్టులో సమర్పించారు. అయితే జస్టిస్ అంబుజనాథ్కు చెందిన బెంచ్ తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
జార్ఖండ్ హైకోర్టులో బీజేపీ నేత నవీజ్ ఝా ఆ కేసును ఫైల్ చేశారు. బీజేపీ నేత అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆ పిటీషన్లో ఆరోపించారు. తొలుత లోయర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆ మ్యాటర్‌ను జార్ఖండ్ హైకోర్టుకు తరలించారు.