రాంచీ, నవంబర్ 17: మైనింగ్ లీజుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు. అంతకుముందు తన ఇంటి వద్ద మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈడీ వైఖరిని తప్పుబట్టారు. ‘నేను రాజ్యాంగ పదవిలో ఉన్నా. నేను దేశం నుంచి పారిపోతాననే రీతిలో ఈడీ వ్యవహరిస్తున్నది. సమన్లు జారీచేస్తున్నది. బడా వ్యాపారవేత్తలు తప్ప ఎవరూ దేశం విడిచి పారిపోయినట్టు నాకు గుర్తులేదు. ఏ రాజకీయ నాయకుడూ అలా వెళ్లలేదు. జేఎంఎం-కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు.