JEE Main | న్యూఢిల్లీ, జనవరి 3: జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల తనిఖీ, బయోమెట్రిక్ హాజరు విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకొన్నది. పరీక్ష రాసే సమయంలో టాయిలెట్ బ్రేక్‌కు వెళ్లి వచ్చిన ప్రతిసారి కూడా అభ్యర్థిని తనిఖీ చేయడం, బయోమెట్రిక్ హాజరు వేయడం తప్పనిసరిగా ఉంటుందని ఎన్టీఏ అధికారులు వెల్లడించారు. అధికారులు, అబ్జర్వర్లు, సిబ్బంది, ఇతర సహాయకులకు కూడా ఇదే ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు.
పరీక్షలో అక్రమాలు జరుగకుండా చూడటం, అభ్యర్థి స్థానంలో మరో వ్యక్తి పరీక్ష రాయడం వంటి కేసులు చోటుచేసుకోకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఎన్టీఏ డైరెక్టర్ సుబోద్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఈ విధమైన ప్రక్రియను రాబోవు కాలంలో ఇతర పరీక్షలకు కూడా విస్తరిస్తామని తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న పరీక్ష విధానం ప్రకారం.. అభ్యర్థులను ఎంట్రీ అప్పుడు తనిఖీ చేయడం జరుగుతుంది. అక్కడే బయోమెట్రిక్ హాజరు కూడా తీసుకొంటారు.
ఉన్నత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ విద్య ప్రవేశాలకు సంబంధించిన జేఈఈ(మెయిన్) పరీక్షను ఈ ఏడాది తెలుగు, ఇంగ్లిషు సహా 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్లో భాగంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదల అవుతాయి. అదేవిధంగా రెండో సెషన్ పరీక్ష ఏప్రిల్‌లో ఉంటుంది. అదే నెల 25న ఫలితాలు విడుదల చేస్తారు.