JEE Main | హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. తెలంగాణ విద్యార్థి బనిబ్రత మజీ 300లకు 300 మార్కులతో సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 300 మార్కులు సాధించగా, తెలంగాణ నుంచి ఒకే ఒక్క విద్యార్థి బనిబ్రత మజీ వంద శాతం మార్కులతో ఆలిండియా ఓపెన్ కోటా టాపర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ 14 మందిలో ఏపీకి చెందిన గుత్తికొండ సాయిమనోజ్ఞ ఒక్కరే అమ్మాయి. అత్యధికంగా రాజస్థాన్ నుంచి ఐదుగురికి వంద శాతం మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్ -1 పరీక్షలను జనవరి 22 నుంచి 29 తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 13,11,544 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 12,58,136 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం పేపర్ -1(బీఈ, బీటెక్) ఫలితాలు విడుదల చేయగా, పేపర్ -2 (బీఆర్క్, బీ ప్లానింగ్) ఫలితాలను తర్వాత విడుదల చేయనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది.
ఈసారి జేఈఈ ఫలితాలు నిరాశపరిచాయనే చెప్పుకోవచ్చు. గతంతో పోల్చితే 300కు 300 మార్కులు సాధించిన వారు తక్కువగా ఉన్నారు. ఛాయిస్ ప్రశ్నలను తొలగించిన ప్రభావం ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. ఇది వరకు జేఈఈ మెయిన్ సెక్షన్ -బీలో ఛాయిస్ ప్రశ్నలు ఉండేవి. 10 ప్రశ్నలు ఇచ్చి, 5 ప్రశ్నలు రాసే అవకాశముండేది. ఇప్పుడు మాత్రం ఐదింటికి ఐదు జవాబులు రాయాల్సి ఉంటుంది. దీంతో వంద శాతం మార్కులు రావడం కష్టంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జేఈఈ మెయిన్ -2 పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జరగనున్నాయి. మెయిన్ -1లో సాధించిన స్కోర్‌తో సంతృప్తి చెందని వారు మెయిన్ -2 పరీక్షలకు హాజరుకావచ్చు. ఈ రెండు పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోర్ పరిగణనలోకి తీసుకుని జేఈఈ మెయిన్ తుది ర్యాంకులను కేటాయిస్తారు. మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికచేస్తారు.
జేఈఈ కోసం చాలా శ్రమించా. రోజుకు 12 -14 గంటల పాటు కష్టపడ్డా. కెమిస్ట్రీ చాలా కష్టంగా అనిపించినా సవాల్‌గా తీసుకుని ప్రిపేరయ్యా. పొరపాట్లు గుర్తించి, వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టా. ప్రిపరేషన్ సమయంలో ఒత్తిడికి గురయ్యా. చెస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడి ఒత్తిడిని దూరం చేసుకునేవాడిని. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించి, ఐఐటీ బాంబేలో చేరడమే నా లక్ష్యం.