JEE Main 2026 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్షల తేదీలను వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. పరీక్షలకు దరఖాస్తు తేదీలు, పరీక్షల తేదీలకు సంబంధించిన వివరాలతో కూడిన షెడ్యూల్ను ఆ ప్రకటనలో వెల్లడించింది. ఆ షెడ్యూల్ ప్రకారం.. జేఈఈ మెయిన్-2026 తొలి సెషన్ పరీక్షలు 2026 జనవరి 21 నుంచి 30వ తేదీ వరకు, రెండో సెషన్ పరీక్షలు 2026 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు జరగనున్నాయి.
తొలి సెషన్ కోసం దరఖాస్తులు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయని ఎన్టీఏ తెలిపింది. అదేవిధంగా రెండో సెషన్ పరీక్షల కోసం దరఖాస్తులు 2026 జనవరి ఆఖరి వారంలో ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈసారి జేఈఈ పరీక్షలు జరిగే నగరాల సంఖ్యను పెంచినట్లు ఎన్టీఏ తెలియజేసింది. అదేవిధంగా అంగవికలురైన అభ్యర్థుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొంది.