Prashant Kishore : బీహార్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 220 సీట్లు గెలుస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన ప్రకటనకు జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు, నాయకుడు ప్రశాంత్ కిషోర్ కౌంటర్ ఇచ్చారు. నితీశ్ కుమార్ పార్టీకి 20 సీట్లు కూడా దక్కవని అన్నారు. బీజేపీ, నితీశ్ కుమార్‌లు ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిశోర్ గత కొంతకాలంగా నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు.
నితీశ్ కుమార్ రాజకీయంగా భారంగా మారారని, ఆయనతో ఏ పార్టీ పొత్తు పెట్టుకోదని, ఒకవేళ పెట్టుకున్నా ఆ పార్టీ మునగడం ఖాయమని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. నితీశ్ కుమార్‌పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని అన్నారు. ఆయన ఎన్డీఏ కూటమితో వెళ్లినా, మహా కూటమితో వెళ్లినా ప్రజలు ఓడించడం ఖాయమని చెప్పారు. బీజేపీకి కూడా అదే పరిస్థితి ఉంటుందని, బీహార్ సర్కారులో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఇక్కడి ప్రజల సంక్షేమం కంటే ఢిల్లీలో పార్టీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నదని ఆరోపించారు.