పాట్నా: బీహార్(Bihar)లో మంత్రిమండలిని విస్తరించారు. కొత్తగా ఇవాళ 31 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తనయుడు నిషాంత్ కుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. బీహార్‌లో అయిదు పార్టీల ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైని మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నిషాంత్ కుమార్‌తో పాటు డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా, మాజీ మంత్రులు శ్రావన్ కుమార్, అశోక్ చౌదరీలు కూడా ఇవాళ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ కూడా హాజరయ్యారు. జేడీయూ నేత నితీశ్ కుమార్ గత నెలలో సీఎం పదవికి రాజీనామా చేయడంతో అక్కడ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత సీఎంగా సమ్రాట్ చౌదరీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఎల్జేపీఆర్వీ, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం పార్టీలు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి.