UP Polls : బీజేపీ పంచన చేరే ప్రసక్తే లేదని రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ చౌధరి తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా మతపరమైన అల్లర్లను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, ఎన్నటికీ బీజేపీతో జట్టుకట్టే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. జాట్ సామాజిక వర్గాన్ని కాకా పట్టే క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలున్నాయని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొన్ని రోజుల క్రితం యూపీలో పర్యటిస్తూ, జాట్ వర్గం నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జయంత్ చౌధరి తప్పుడు ఇంటిని ఎంచుకున్నారని, బీజేపీలో ఆయనకు ఎప్పుడూ తలుపులు తెరిచే వుంటాయని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జయంత్ చౌధరి పై వ్యాఖ్యలు చేశారు.
జాట్ సామాజిక వర్గాన్ని చల్లబరిచేందుకు అమిత్‌షా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా జరగనివ్వను. యూపీ ఎన్నికల్లోనే కాదు.. ఎప్పుడూ బీజేపీ పంచన చేరను.ఈ విషయాన్ని నేను రాసిస్తాను. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నా పార్టీని నా చేతులతోనే నాశనం చేసుకున్నట్టు అని జయంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి అజిత్ చౌధరిని బీజేపీ తక్కువ చేసి చూసిందని, ఇదో గుణపాఠమని పేర్కొన్నారు. యూపీ రైతులకు ఎంతో చేస్తామని బీజేపీ తెగ వాగ్దానాలు చేసిందని, కానీ చేసిందేమీ లేదని జయంత్ చౌధరి తీవ్రంగా మండిపడ్డారు.