న్యూఢిల్లీ : కాషాయ పార్టీ అనుసరిస్తున్న బుల్డోజర్ న్యాయంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఆక్రమణల కూల్చివేతకు దిగిన అధికారులను సుప్రీంకోర్టు నిలువరిస్తూ ఈ డ్రైవ్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. నిందితుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడం రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని ఆర్జేడీ నేత జయంత్ చౌదరి అన్నారు. మరోవైపు జేసీబీలతో కూల్చివేతలను ఆపి విద్యుత్ కోతలను అరికట్టేందుకు పవర్ ప్లాంట్లను ఆన్ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హితవు పలికారు.
నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన కూల్చివేతల డ్రైవ్ రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ ఆరోపించారు. కూల్చివేతలను నిలిపివేయాలని గురువారం ఈ అంశాన్ని విచారణకు చేపడతామని అప్పటివరకూ యధాతధ స్ధితి కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం సంయమనం పాటించాలని సీపీఎం నేత బృందా కరత్ కోరారు.
కాగా, హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా శనివారం జరిగిన అల్లర్లలో నిందితులు జహంగీర్‌పురిలోని అక్రమ నిర్మాణాల్లో ఉంటున్నారని వాటిని కూల్చివేయాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ అదేష్ గుప్తా ఆరోపించిన క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేపట్టడం గమనార్హం. జహంగీర్‌పురిలో జరిగిన ఘర్షణల్లో తొమ్మిది మంది గాయపడగా ఈ కేసుకు సంబంధించి 25 మందిని ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకూ అరెస్ట్ చేశారు.