Justice Jasti Chelameswar | చెన్నై, న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: పార్లమెంట్ లేదా రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన చట్టాలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించే అధికారం సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులకు ఉన్నపుడు అధికారిక విధుల నిర్వహణకు సంబంధించి రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, గవర్నర్లకు ఆదేశాలు ఇచ్చే అధికారం కూడా ఉంటుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. భారత రాజ్యాంగం 75 ఏండ్ల ప్రస్థానంపై శనివారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీటీ సెల్వం అడిగిన ప్రశ్నకు జస్టిస్ చలమేశ్వర్ సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్లు నివేదించిన బిల్లులపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడంపై ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖఢ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పార్లమెంట్ చేసిన చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని న్యామమూర్తులుగా మనం ప్రకటించే అధికారం ఉన్నపుడు ఆ చట్టాలను చేసిన ప్రజాప్రతినిధులు తమ విధులను నిర్వహించడానికి గడువు విధించే అధికారం మనకు ఎందుకు ఉండదని జస్టిస్ చలమేశ్వర్ ప్రశ్నించారు.
అంతకుముందు ఆయన ఉపన్యసిస్తూ రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన ఈ సందర్భాన్ని ఉత్సవాలు జరుపుకోవడానికి బదులుగా ఆత్మ పరిశీలనకు లభించిన అవకాశంగా భావించాలని సూచించారు. గడచిన 75 ఏండ్లలో రాజ్యాంగానికి వందకు పైగా సవరణలు జరిగాయని, ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు విచక్షణారహితంగా డబ్బులు ఖర్చు చేశారని, న్యాయ వ్యవస్థకు కేటాయించిన అసమగ్ర బడ్జెట్ కేటాయింపుల కారణంగా బకాయిలు పెరిగిపోయాయయని, ఇవన్నీ ఆందోళనకరమైన అంశాలేనని ఆయన అన్నారు.
రాష్ట్రపతి, గవర్నర్ల చర్యలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పడం లక్ష్మణ రేఖను దాటినట్లు కాదని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగీ అభిప్రాయపడ్డారు. ఓ వార్తా సంస్థకు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, న్యాయస్థానాల అభిప్రాయాలతో పార్లమెంట్ ఏకీభవించకపోతే, నిబంధనలను సవరించే సర్వోన్నత అధికారం పార్లమెంట్‌కు ఉందని పునరుద్ఘాటించారు. న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ పరస్పరం ఢీ కొంటున్నాయనే వాదనను తోసిపుచ్చారు.
మన దేశ రాజ్యాంగం రాష్ట్రపతికి కల్పించిన అధికారాలు పరిమితమేనని పేర్కొంటూ, బిల్లులను ఆమోదించడానికి నిర్దిష్ట కాలపరిమితి విధిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసఫ్ స్వాగతించారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ఉద్దేశించి అది ‘సూపర్ పార్లమెంట్’గా వ్యవహరిస్తున్నదని, ప్రజాస్వామ్య శక్తులపై ఆర్టికల్ 142 ‘అణు క్షిపణి’గా మారిందంటూ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై ఒక ఆంగ్లమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. సుప్రీం కోర్టు రాజ్యాంగ పరిరక్షకునిగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. బిల్లులను గవర్నర్ నెలల పాటు పెండింగ్‌లో ఉంచిన క్రమంలో, ఆయనకు, రాష్ట్రపతికి ఉన్న అధికారాలను గుర్తు చేస్తూ.. సుప్రీం కోర్టు 142 అధికరణను ఆవాహన చేసుకుని తీర్పు చెప్పడం సరైనదేనని అన్నారు.