Stem Cell | టోక్యా, నవంబర్ 11 : లింబాల్ స్టెమ్ సెల్ డెఫీషియెన్సీ(ఎల్ఎస్సీడీ) సమస్యతో కంటిచూపు కోల్పోయిన వారి కోసం జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త చికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు. ఎల్ఎస్సీడీ సమస్య ఉన్న వారిలో కార్నియాలోని లింబాల్ స్టెమ్ సెల్స్ మరమ్మతు చేసుకునే, పునరుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీంతో కార్నియాపై మచ్చలు ఏర్పడి, క్రమంగా కంటిచూపు కోల్పోతారు. వీరికి మళ్లీ కంటిచూపు రావాలంటే ఆరోగ్యకరమైన దాత నుంచి లేదా రోగి మరో కంటి నుంచి కార్నియాను సేకరించి ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి. చాలా రిస్కుతో కూడుకున్న ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సను అభివృద్ధి చేశారు.
ఇందులో భాగంగా ఈ సమస్య ఉన్న నలుగురికి ఇండ్యూస్డ్ ప్లురిపొటెంట్ స్టెమ్(ఐపీఎస్) నుంచి సేకరించిన కణాలను కార్నియా కణాల స్థానంలో శాస్త్రవేత్తలు ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. వీరిలో ముగ్గురికి ఏడాదికాలంలో కంటిచూపు మెరుగయ్యిందని, మరొకరిలో మాత్రం తాత్కాలిక మార్పు కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ చికిత్సలో భాగంగా ఆరోగ్యకరమైన రక్త కణాలను పిండం లాంటి ఆకారంలోకి రీప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత వీటిని ఉపయోగించి ట్రాన్స్పరెంట్ టిష్యూను తయారుచేసి పాడైన కార్నియాలోకి చేరుస్తామని శాస్త్రవేత్త డాక్టర్ కోహ్జి నిషిద తెలిపారు. ఈ చికిత్సకు సంబంధించిన వివరాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.