Janata Ki Adalat : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ మరోసారి జనతా కీ అదాలత్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 6న దేశ రాజధాని న్యూఢిల్లీలోని చత్రశాల్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. సెప్టెంబర్ 22న కూడా కేజ్రివాల్ ఇదే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీ ప్రజలతో నేరుగా ప్రభుత్వం సంబంధాలు కలిగి ఉండేలా ఈ జనతా కీ అదాలత్ కార్యక్రమాన్ని ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ తెరపైకి తీసుకొచ్చారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వంలోని మంత్రులతోపాటు ఉన్నతాధికారులతో నేరుగా విన్నవించుకోవచ్చు. ప్రజలు, ప్రభుత్వం మధ్య దూరాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. కాగా మద్యం పాలసీకి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించింది. ఈ కేసులో ఆయనకు ఇటీవల సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రిగా ఎక్కడా సంతకం చేయవద్దని షరతు విధించింది.
దాంతో జైలు నుంచి విడుదలైన వెంటనే అర్వింద్ కేజ్రీవాల్.. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జనతా కీ అదాలత్‌ను ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా బీజేపీలో చోటుచేసుకున్న పరిణామాలపైన, ప్రధాని నరేంద్రమోదీపైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ మరునాడు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్షం సమావేశమై అతిషిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. అనంతరం కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ సీఎంగా అతిషి బాధ్యతలు చేపట్టారు.
కాగా, ఈ ఏడాది మార్చి 21న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రివాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దాంతో ఆయన జైల్లోనే ఉండిపోయారు. అలాగే ఆ పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సైతం తీహార్ జైల్లోనే ఉన్నారు. దాంతో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరం బాగా పెరిగిందని ఆ పార్టీలోని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే అర్వింద్ కేజ్రీవాల్ జనతా కీ అదాలత్ కార్యక్రమాన్ని చేపట్టి ఆ అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.