Jan Aushadhi : తక్కువ ధరకు లభించే నాణ్యమైన మందులుగా పేరున్న జనరిక్ ఔషధాలను మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరవేసేందుకు తపాల శాఖ సుముఖత వ్యక్తం చేసింది. కర్ణాటక రాజ్యసభ ఎంపీ లహర్ సింగ్ సిరోయా ఈ మేరకు చేసిన ప్రతిపాదన అమలుపై ఔషధ శాఖతో చర్చించి ముందుకెళ్తామని పేర్కొన్నది.
ప్రధాన్ మంత్రి జన్ ఔషధి పరియోజన పథకం ద్వారా కేంద్రం ఏర్పాటు చేసే జనరిక్ ఔషధ దుకాణాలను విస్తృతమైన నెట్వర్క్ కలిగిన తపాల శాఖ ద్వారా ప్రజలకు చేరువ చేయాలని లహర్ సింగ్ ఇటీవల పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పోస్టాఫీసులు, తపాలా శాఖకు చెందిన ఖాళీ స్థలాల్లో జనరిక్ ఔషధ స్టోర్లను ఏర్పాటు చేయాలని కోరారు. తపాల శాఖ బట్వాడా సేవల ద్వారా జనరిక్ మందులను గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరవేయాలని సూచించారు. ప్రజలు ఆన్లైన్లో జనరిక్ మందులను ఆర్డర్ చేసే వ్యవస్థను రూపొందించాలని సలహా ఇచ్చారు.
దీనిపై ఈ నెల 7న కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించి లహర్ సింగ్కు లేఖ రాశారు. జనరిక్ ఔషధాలను ప్రజలకు చేరువ చేసే విషయంలో ఫార్మాస్యూటికల్స్ శాఖతో కలిసి పని చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి ముందుకు వెళ్తామని వెల్లడించారు.