శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న నౌషెరా సెక్టార్లో శనివారం పేలుడు సంభవించింది. కలాల్ ప్రాంతంలో ఆర్మీ బలగాలు పెట్రోల్ నిర్వహిస్తుండగా పేలుడు జరిగింది. ప్రమాదంలో ఘటనలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. అయితే, పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా బలగాలు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో పేలుడు పదార్థాన్ని అక్కడ పెట్టారా? ఎప్పుడో పడేసి ఉంటారా? అనేది స్పష్టంగా తెలియరాలేదు.
సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందం సైతం పేలుడు జరిగిన చోటు వద్దకు చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నాయి. ఇటీవల నియంత్రణ రేఖ వెంట భారత భూభాగంలోకి ఉగ్రవాదులు చొరబాట్లకు యత్నిస్తున్న క్రమంలో పేలుడు సంభవించడం అనుమానాలకు తావిస్తోంది. జమ్మూకశ్మీర్లో ఆర్మీ, భద్రతా బలగాలను మోహరించి హైఅలర్ట్ ప్రకటించారు.
అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ను సైతం ప్రారంభించాయి. ఈ క్రమంలో పేలుడు సంభవించడం స్థానికంగా కలకలం సృష్టిస్తున్నది. పూంచ్, రాజౌరి జిల్లాల అటవీ ప్రాంతంలోకి ఉగ్రవాదులు చొరబడగా.. సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. చాలా సంవత్సరాల తర్వాత సుదీర్ఘమైన సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు రెండు వేర్వేరు ఉగ్రదాడుల్లో తొమ్మిది మంది సైనికులు వీర మరణం పొందారు.