Baramulla | జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాద కుట్రను భగ్నం చేశాయి. హంద్వారా-బారాముల్లా హైవేపై భద్రతా బలగాలు బుధశారం ఐఈడీని గుర్తించి నిర్వీర్యం చేశాయి. కుప్వారా జిల్లాలోని హంద్వారా ప్రాంతంలోని లాంగేట్ వద్ద హైవే వెంబడి అనుమానాస్పద బ్యాగ్‌ను పోలీసులు, ఆర్మీ సంయుక్త గస్తీ బృందం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత డిస్పోజల్ టీం అక్కడికి చేరుకొని అనుమానాస్పద బ్యాగ్‌ను స్వాధీనం చేసుకొని.. ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని పేర్కొన్నారు. ఇంతకు ముందు డిసెంబర్ 9న శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై టీసీపీ పల్హల్లాన్ వద్ద అనుమానాస్పద బ్యాగ్ కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. విచారణ అనంతరం బ్యాగ్‌లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (IED) అమర్చినట్లు గుర్తించారు. భద్రతా బలగాలు ఐఈడీని స్వాధీనం చేసుకుని ఉగ్రవాదుల దుశ్చర్యను తిప్పికొట్టారు. అనంతరం అనుమానాస్పద వస్తువును సైన్యం ధ్వంసం చేసింది.