జమ్ము, శ్రీనగర్, అక్టోబర్ 1: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం జరిగిన మూడో, ఆఖరి విడత ఎన్నికల్లో 69 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
జమ్ము, సహా జమ్ముకశ్మీర్‌లోని 40 అసెంబ్లీ స్థానాలకు పటిష్ఠ బందోబస్తు మధ్య ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 370 అధికరణ రద్దు తర్వాత మొదటిసారి జరిగిన ఈ ఎన్నికలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు సహా అన్నింటిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడతాయి.