న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ పార్టీ జాతీయ ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ కొద్దిమంది ప్రయోజనాల ప్రాతిపదికనే సాగుతోందని ఆరోపించారు. దేశ విశాల ప్రయోజనాలతో పాటు ప్రజా ప్రయోజనాలను పణంగా పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
హిమాచల్ ప్రదేశ్ పార్టీ స్టీరింగ్ కమిటీ చీఫ్ ఆనంద్ శర్మ, జమ్ము కశ్మీర్ ప్రచారకమిటీ చీఫ్ గులాం నబీ ఆజాద్‌లు తమ పదవులకు రాజీనామా చేసిన క్రమంలో జైవీర్ షెర్గిల్ పార్టీ ప్రతినిధగా వైదొలిగారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీనియర్ నేతలు కీలక బాధ్యతల నుంచి తప్పుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌కు కట్టబెట్టే దిశగా పార్టీ హైకమాండ్ పావులు కదుపుతోంది. ఈ నిర్ణయం కాంగ్రెస్‌లో అంతర్గతంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.