రాంచీ: మనీల్యాండరింగ్ కేసులో జైలు పాలైన జార్ఖండ్ మంత్రి ఆలమ్‌గిర్ ఆలమ్(Alamgir Alam) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా కూడా ఆయన రిజైన్ చేశారు. రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలు నుంచి సీఎం చంపాయి సోరెన్‌కు ఆయన లేఖ రాశారు. క్యాబినెట్ మంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆ లేఖలో ఆలమ్ తెలిపారు.
ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేకు కూడా ఆలమ్ ఓ లేఖ రాశారు. జార్ఖండ్ సీఎల్పీ నేత పోస్టుకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. సీఎల్పీ నేతగా సేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మనీల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతను మే 15వ తేదీన ఈడీ అరెస్టు చేసింది. ఆ మంత్రికి చెందిన ఓ వ్యక్తి ఇంటి నుంచి సుమారు 32 కోట్లు సీజ్ చేశారు.
మంత్రి ఆలమ్‌ను క్యాబినెట్ నుంచి తొలగించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. మంత్రి ఆలమ్ వద్ద ఉన్న శాసనసభ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలను సీఎం ఛార్జ్ తీసుకున్నారు.