బెంగళూరు: అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కర్ణాటకలోని హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు (Prajwal Revanna) పరప్పన అగ్రహార జైలులో లైబ్రరీ క్లర్క్‌గా పని కేటాయించారు. తోటి ఖైదీలకు పుస్తకాలు జారీ చేయడం, వాటి రికార్డులను నిర్వహించడం వంటి బాధ్యతలు ఆయన నిర్వహించాలి. ఈ పని చేసినందుకు రోజుకు రూ.522 చెల్లిస్తారు.
కాగా, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు, జేడీ(ఎస్) సీనియర్ నేత, హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ కుమారుడైన ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన అత్యాచారం కేసులో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు శిక్ష పడిన వారు జైలులో ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పరిపాలనా పరమైన పనులు చేయడానికి రేవణ్ణ ఆసక్తి చూపినట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే ఆయనకు లైబ్రరీ క్లర్క్ పని అప్పగించినట్లు చెప్పారు.
మరోవైపు ఖైదీలు సాధారణంగా వారానికి మూడు రోజులు, నెలలో కనీసం 12 రోజులు జైలులో పని చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కోర్టు విచారణలకు హాజరు కావడం, న్యాయవాదులను కలిసేందుకు ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు కేటాయించిన లైబ్రరీ క్లర్క్ పని షెడ్యూల్ పరిమితంగా ఉన్నదని వెల్లడించారు.
Also Read: