ఢిల్లీ : అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) వ్యవస్థాపకుడు-ట్రస్టీ జగ్దీప్ ఛోకర్(81)శుక్రవారం తెల్లవారుజామున గుండె పోటుతో ఢిల్లీలో మరణించారు. రైల్వేలో మెకానికల్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత ఐఐటీ-అహ్మదాబాద్‌లో అధ్యాపకుడిగా చేరి డీన్, డైరెక్టర్ స్థాయికి ఎదిగారు.
1999 లోక్‌సభ ఎన్నికల్లో అహ్మదాబాద్ నుంచి పోటీచేసిన అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలనలో పారదర్శకతపై కీలక ప్రశ్నలు లేవనెత్తిన తన సహోద్యోగి త్రిలోచన్ శాస్త్రి నుంచి పొందిన ప్రేరణతో ఛోకర్ ఏడీఆర్‌కు అంకురార్పణ చేశారు. ఛోకర్, శాస్త్రి వేసిన పిటిషన్ల కారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ విద్యార్హతలు, ఆదాయం, ఆస్తులు, క్రిమినల్ కేసులు తదితర వివరాల గురించి ప్రమాణ పత్రాల్లో పేర్కొనాలని నవంబర్ 2000లో ఢిల్లీ హైకోర్ట్ ఆదేశాలిచ్చింది.