బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ సీఎం జగదీష్ శెట్టార్‌ను (Jagadish Shettar) ఉప ఎన్నికల బరిలో నిలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. జూన్ 30న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో శెట్టార్తో పాటు తిప్పనప్ప కమక్నూర్, ఎన్ఎస్ బోసురాజును పార్టీ అభ్యర్ధులుగా ఖరారు చేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ నిరాకరించడంతో ముగ్గురు బీజేపీ నేతలు లక్ష్మణ్ సవది, బాబూరావు చిచన్సుర్, ఆర్ శంకర్లు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇదే కారణంతో మాజీ సీఎం, లింగాయత్ నేత జగదీష్ శెట్టార్ కాషాయ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ టికెట్‌పై ఆయన హుబ్బలి ధార్వాడ్ సెంట్రల్ సీటులో పోటీలో నిలిచి ఓటమి పాలయ్యారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో శెట్టార్ సేవలను వినియోగించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శెట్టార్‌ను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బరిలో నిలిపింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు వేయనున్నందున అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 135 సీట్లు ఉండటంతో ఆ పార్టీ ఎమ్మెల్సీల గెలుపు అనివార్యం కానుంది. జూన్ 30న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.
Read More :