Jabalpur boat : మధ్యప్రదేశ్లోని జబల్పూర్ పరిధిలో గురువారం సాయంత్రం బోటు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బార్గి డ్యామ్ వద్ద నర్మదా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 9 మంది మరణించారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వారి కోసం వెతుకుతుండగా గుండెలు పిండేసే దృశ్యం సహాయక బృందాల కంటపడింది. నాలుగేళ్ల తన కొడుకుని తల్లి హత్తుకుని మరణించింది. ఆ చిన్నారి కూడా తన తల్లిని పట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు.
మరణంలోనూ తల్లీకొడుకు ఒకరినొకరు విడిచిపెట్టకుండా, చివరి క్షణం వరకు హత్తుకుని ఉండిపోయారు. ఒకరినొకరు పట్టుకుని ఉండిపోయిన తల్లీకొడుకు మృతదేహాలు నీటిలో తేలడం చూసిన సహాయక బృంద సభ్యులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రతి ఒక్కరినీ ఈ దృశ్యం కదిలిస్తోంది. గుండె బరువెక్కేలా చేస్తోంది. ఈ ఇద్దరితోపాటు వీరి కుటుంబానికి చెందిన మరో ఇద్దరు ఢిల్లీ నుంచి ఇక్కడికి విహార యాత్రకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి మృతదేహాల్ని రెస్క్యూ బృందాలు ఒడ్డుకు చేర్చాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మంది మరణించారు. 16 మందిని అధికారులు రక్షించారు.
అయితే, ఎంతమంది ఇంకా గల్లంతయ్యారనేదానిపై స్పష్టత లేదు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 40–45 మంది ఉన్నట్లు అంచనా. గల్లంతైన మిగతావారి కోసం సహాయక బృందాలు వెతుకుతున్నాయి. భారీ వర్షం, తుపాన్ కారణంగా బోటు బోల్తా పడినట్లు అధికారులు చెబుతున్నారు. తీరానికి 300 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో లోతు 20 అడుగులకుపైనే ఉంటుందని అంచనా. ప్రస్తుతం భారీ గజ ఈతగాళ్లు, డైవర్లు, భారీ యంత్రాల సాయంతో గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు. ఈ ప్రమాద ఘటనలో బోటు నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందని అధికారులు అంటున్నారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.
అలాగే, లైఫ్ జాకెట్లు కూడా ముందుగా ఇవ్వలేదు. పడవ బోల్తా పడుతున్న సమయంలో కొందరికి లైఫ్ జాకెట్లు అందించారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానికులే సహాయం అందించారు. వారు తాళ్లు, పైపులు అందించి వీలైనంత మందిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.