న్యూఢిల్లీ, జూన్ 8: పాక్ ఆక్రమిత కశ్మీర్ హింసాత్మక ఘర్షణలతో అట్టుడుకుతున్నది. అల్లర్లలో ఇప్పటి వరకు 11 మంది చనిపోగా.. 70 మందికి పైగా గాయపడ్డారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. సోమవారం నిరసనకారులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీస్ అధికారులు, అటుగా వెళ్తున్న ఒక సామాన్య వ్యక్తి చనిపోయారు. దీంతో ప్రతిస్పందనగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు నిరసన కారులు మరణించారని స్థానిక కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ తెలిపారు. అంతకు ముందు ఆదివారం జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 23 మంది పోలీస్ అధికారులు, 50 మంది నిరసనకారులు గాయపడ్డారని.. 30 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీస్ చీఫ్ లియాఖత్ మాలిక్ వెల్లడించారు.
జూన్ 9న లాక్డౌన్..
పాక్ ఆక్రమిత్ కశ్మీర్లో జూలై 27న శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో 45 స్థానాలకు గాను 12 స్థానాలను శరణార్థులకు కేటాయించడాన్ని జేఏఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ స్థానాలను రద్దు చేయాలని.. ఆ స్థానాల్లో పోటీ చేసేవారెవరూ స్థానికంగా కాకుండా పాకిస్థాన్లో ఉంటారని చెబుతున్నది. కాల్పులపై జేఏఏసీ నాయకుడు షౌకత్ నవాజ్ మిర్ స్పందిస్తూ.. ప్రభుత్వం తమపై హింసాత్మక చర్య మొదలుపెట్టిందని.. ఇందుకు ప్రతిగా జూన్ 9న లాక్ డౌన్ నిర్వహిస్తామని ప్రకటించారు.
జేఏఏసీపై నిషేధం..
ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద జేఏఏసీపై జూన్ 5న అధికారులు నిషేధం విధించారు. అంతే కాకుండా దేశీయ, విదేశీ పర్యాటకులను జూన్ 9లోగా పీవోకే విడిచి వెళ్లాలంటూ ఇప్పటికే అధికారులు సూచించారు.