Gold Seized | భారత్-చైనా సరిహద్దుల్లో ఇండో టిబెటన్ బోర్డర్ (ITBP) పోలీసులు పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చొరబాటుదారుల నుంచి 108 కిలోల బంగారు కడ్డీలను పట్టుకున్నది. అయితే, సరిహద్దుల్లో ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని పట్టుకోవడం ఐటీబీపీ చరిత్రలో ఇదే తొలిసారి. లడఖ్ సెక్టార్లో ఇద్దరు అనుమానితుల వ్యక్తుల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐటీబీపీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లడఖ్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో సెరిగాప్లే ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను గుర్తించినట్లు తెలిపారు. వారిని విచారించగా ఔషధ మొక్కలను సేకరిస్తున్నామని చెప్పినట్లు పేర్కొంది.
ప్రస్తుత సమయంలో చొరబాటు, స్మగ్లింగ్‌కు ఎక్కువ అవకాశాలు ఉండగా వారి వద్ద తనిఖీలు చేయగా 108 బంగారం దొరికినట్లు తెలిపారు. అలాగే, ఓ బైనాక్యూలర్, కొన్ని కత్తులు, చైనీస్ ఫుడ్, రెండు పోనీలు, మరో రెండు మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని.. మరో అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇద్దరు నిందితులను లడఖ్‌లోని హన్లీ గ్రామానికి చెందిన టెన్జింగ్ టార్గే (40), చెరింగ్ చంబా (69) గురించినట్లు పేర్కొన్నారు. లడఖ్, శ్రీనగర్ సెక్టార్లో ఐటీబీపీ తనిఖీలు చేస్తుందని చెప్పారు. అనుమానిత వ్యక్తులను తప్పించుకునేందుకు యత్నించగా పెట్రోలింగ్ పార్టీ పట్టుకుందని తెలిపారు. లడఖ్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. అనుమానితులను కస్టమ్స్ విభాగానికి అప్పగించనున్నట్లు అధికారులు వివరించారు.