PM Modi | ప్రధాని మోదీ చెప్పింది ఒకటి.. ప్రపంచం చూస్తున్నది మరొకటి! కేంద్రం వాదిస్తున్నది ఒకటి బయట కనిపిస్తున్నది మరొకటి! కాల్పుల విరమణ నిర్ణయం జాతిని ఎంత నిరాశపరిచిందో ఆయన చేసిన ప్రసంగం అంతకంటే ఎక్కువ నిరాశ పరిచింది.
ప్రత్యర్థి పాక్‌ని కాళ్లబేరానికి రప్పించామని మోదీ చెప్పిండు.. కానీ తామే గెలిచామని పాక్ ముందే ప్రకటించుకున్నది. ఉగ్ర మూకలను తుదముట్టించామని మోదీ చెప్పిండు.. కానీ వాళ్లిప్పటికీ పాక్‌లో బహిరంగంగా తిరుగుతూనే ఉన్నరు. పాక్ కాళ్ల బేరానికి వచ్చిందని మోదీ చెప్పిండు. కానీ దాయాది ఇప్పటికీ తలెగరేస్తూనే ఉన్నది. టెర్రరిస్టులను గడగడలాడించామని మోదీ చెప్పిండు. కానీ మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ఇంకా సవాలు విసురుతూనే ఉన్నరు.
పహల్గాంలో చెదిరిపోయిన సిందూరాలకు ప్రతీకారం తీర్చుకున్నమని మోదీ చెప్పిండు. కానీ, నవజంటలను కాల్చిచంపిన ముష్కరులు ఇంకా చేతికి చిక్కనేలేదు. పాక్ హద్దుమీరితే సహించేది లేదని మోదీ అన్నడు. కానీ, ఆయన ప్రసంగం ముగిసిన కొద్దిగంటలకే కశ్మీర్‌లోని సాంబాలో మళ్లీ పాక్ డ్రోన్లు ఎగురుతూ కనిపించాయి. పాక్‌తో చర్చలంటే ఉగ్రవాదంపైనే అని మోదీ అన్నడు. కానీ, ఉగ్రవాదానికి మద్దతు ఆపుతున్నట్టు పాక్ ఇప్పటికీ ప్రకటించలేదు. ఆ దేశ ఆర్మీ జనరళ్లు ఉగ్రవాదుల అంత్యక్రియలకే హాజరై జాతీయ జెండాలు కప్పి శాల్యూట్ చేస్తున్నరు.
పాకిస్థాన్‌తో జరిగిన గత నాలుగు యుద్ధాల్లో భారత్ పైచేయిని, పాక్ ఓటమిని ప్రపంచం కళ్లారా చూసింది. కానీ ఇప్పుడు మాత్రం మోదీ చెప్తేనే వినాల్సిన పరిస్థితి తలెత్తింది. పాకిస్థాన్ కోలుకోలేని దెబ్బతినడం వల్లే లొంగిపోయిందని మోదీ అంటున్నా రాయబారం చేసిన ట్రంప్ నోట ఆ మాటే రావడం లేదు. నాడు తనను బెదిరించిన అమెరికా అధ్యక్షుడు నిక్సన్ నోటితోనే ఇందిరాగాంధీ ‘ఆసియాలో భారత్ ప్రధాన శక్తి’ అని అనిపించగలిగింది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌ను బెదిరించి కాల్పుల విరమణకు ఒప్పించామని భారత్, పాక్‌లకు కామన్ సెన్స్ ఉందని బహిరంగంగా ఒకే గాటన కట్టిపడేసే పరిస్థితి వచ్చింది నేడు.
గతంలో కుదుర్చుకున్న ఏ ఒప్పందాన్నీ పాకిస్థాన్ గౌరవించలేదు. ఉగ్రవాదానికి మద్దతు ఆపలేదు. అయినా ఎటువంటి షరతులూ విధించకుండా కేవలం డిమాండ్లు పెట్టి పాక్‌ను కట్టడి చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
పాక్ కాలు దువ్వుతూనే ఉన్నది. అయినా కాల్పుల విరమణ ఎందుకొచ్చింది? ప్రత్యర్థి కవ్విస్తూనే ఉన్నడు. మరి మోదీ సర్కారు కాడి ఎందుకు పారేసింది? ప్రశ్నలు అనేకం!.. కారణాలు గోప్యం!..రెండురోజులైనా అంతా అస్పష్టం!!
ముక్తాయింపు:
శనివారం భారత్ కాల్పుల విరమణ ప్రకటించడానికి అరగంట ముందే ట్రంప్ తెరమీదికి వచ్చి భారత్ – పాక్‌ల కాల్పుల విరమణను తానే ప్రకటించారు. సోమవారం ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి రెండుగంటల ముందే మన గురించి ట్రంప్ ప్రపంచాన్ని ఉద్దేశించి సందేశం ఇచ్చిండు.
ఎట్లయిపోయింది భారత్ పరిస్థితి!