జైపూర్: ఇంటి దగ్గర దిగబెట్టే సాకుతో ఒక ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక మహిళను కారులో ఎక్కించుకున్న సహచర ఉద్యోగులు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన ఘటన బీజేపీ పాలిత రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది. సహచర ఉద్యోగి పుట్టిన రోజు వేడుకకు శనివారం ఆ మహిళ హాజరైంది. అతిథులందరూ వెళ్లిపోవడంతో ఆమె ఒక్కర్తే మిగిలింది. అప్పుడు అక్కడే ఉన్న కంపెనీ సీఈవో, ఒక మహిళా ఎగ్జిక్యూటివ్, ఆమె భర్త తమ కారులో రావాలని, ఇంటి వద్ద వదులుతామని ఆ మహిళను కోరడంతో ఆమె సరేనంది. వారు దారిలో ఒక చోట కారును ఆపారు. తర్వాత సిగరెట్లా ఉన్న వస్తువును ఒక షాపు నుంచి తెచ్చారు. అది పీల్చిన తర్వాత ఆ మహిళ స్పృహతప్పి పోయింది. మరునాడు ఉదయం మెలకువ వచ్చిన ఆమెకు తనపై సామూహిక లైంగిక దాడి జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.