న్యూఢిల్లీ: ప్రపంచ ఐటీ దిగ్గజాలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. భారీ సెవెరెన్స్ ప్యాకేజీల నుంచి అవుట్ ప్లేస్మెంట్ సపోర్ట్ వరకు ఉద్యోగుల తొలగింపు చర్యలు కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ‘ఖర్చు తగ్గింపు’ ప్రక్రియలుగా మారాయి. అయితే, ఈ చర్య వెనుక ఒక పద్ధతి ఉందని, దీనికి బ్రాండ్ రక్షణ, పెట్టుబడిదారుల విశ్వాసం వంటి ఆర్థికాంశాలు ముడిపడి ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం కంపెనీలు దీర్ఘకాలికంగా ఖర్చులను కొనసాగించే బదులు, ప్రస్తుతం ఒకేసారి ఆర్థిక భారాన్ని స్వీకరించడానికి మొగ్గు చూపుతున్నాయి. ‘ఎంబ్రేస్ కన్సల్టింగ్’ వ్యవస్థాపకురాలు శ్రుతి స్వరూప్ ఈ వ్యూహాన్ని వివరించారు. సెవెరెన్స్ అనేది చిన్నదే అయినా, అది న్యాయపరమైన సమస్యలను నివారిస్తుంది, ఎంప్లాయర్ బ్రాండ్‌ను కాపాడుతుంది, ఉద్యోగుల బదిలీని వేగవంతం చేస్తుంది అని ఆమె తెలిపారు. అలాగే, ప్రస్తుత ఖర్చులను భరించడం ద్వారా భవిష్యత్తులో జీతాల భారం తగ్గి, సమర్థవంతమైన వ్యయ నిర్మాణాన్ని సాధించవచ్చు. ఇది కంపెనీలకు దీర్ఘకాలికంగా ప్రయోజనకరం. ఈ ఉదారతకు కారణం కేవలం దయ కాదు, రిస్క్ మేనేజ్మెంట్ అని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా టెక్ రంగంలో ప్రతిష్ఠ చాలా కీలకం కాబట్టి, ప్రతికూల ప్రచారం, బ్రాండ్ డ్యామేజ్‌ను తగ్గించుకోవడానికి కంపెనీలు భారీ ఎగ్జిట్ ప్యాకేజీలను అందిస్తున్నాయి.
తొలగింపుల తాజా వేగం కేవలం ఖర్చులను తగ్గించుకోవడం కోసం మాత్రమే కాదని, ఏఐ(కృత్రిమ మేధస్సు)ని లోతుగా అనుసంధానించడం ద్వారా శ్రామికశక్తిని క్రమబద్ధీకరించడం దీని వెనుక ముఖ్య ఉద్దేశం అని గ్రేట్‌లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విభవ్సింగ్ పేర్కొన్నారు. ఏఐ ద్వారా చేపట్టే పనుల నుంచి ఉద్యోగులను తొలగించి, ఇతర విభాగాల్లో పెట్టుబడి పెట్టడానికి ఈ సెవెరెన్స్ ప్యాకేజీలు పరివర్తన వ్యయంగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఇటువంటి బైఅవుట్లు మార్కెట్‌ను భయపెట్టకుండా, టాలెంట్ బేస్‌ను పునర్నిర్మించడానికి, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని నిలబెట్టడానికి సహాయపడతాయి.
ఈ ధోరణి ఇప్పుడు భారతదేశంలోని ఐటీ సేవల రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఇటీవలే ఏఐ ఆధారిత పునర్నిర్మాణంలో భాగంగా 20,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు నివేదించింది. దీనికి సెవెరెన్స్, సంబంధిత ఖర్చుల కోసం సుమారు రూ.1,135 కోట్ల తాత్కాలిక ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేసింది. ఇందులో 3 నెలల నోటీస్ పే, 6 నెలల నుంచి 2 సంవత్సరాల జీతం వరకు సెవెరెన్స్ ప్యాకేజీలు ఉన్నాయి. యాక్సెంచర్ గత మూడేళ్లలో సెవెరెన్స్ కోసం 2 బిలియన్లకు పైగా ఖర్చు చేసింది. ఆటోమేషన్-హెవీ డెలివరీ మోడల్స్‌కు మారడంలో ఇది ఒక నిర్మాణపరమైన చర్యగా కంపెనీ అభివర్ణించింది. ఉద్యోగుల తొలగింపు సమయంలో వారికి మర్యాదపూర్వకమైన, సరసమైన ప్యాకేజీలను అందించడం ద్వారా, కంపెనీలు కొత్త ఉద్యోగులను ఆకర్షించడానికి, క్లయింట్ నమ్మకాన్ని కాపాడుకోవడానికి అవసరమైన తమ ఎంప్లాయర్ బ్రాండింగ్‌ను రక్షించుకుంటాయి. ఈ బిలియన్ డాలర్ల సెవెరెన్స్ బిల్లులు దయతో కూడిన చర్యలు కాదని, ఇవి వ్యూహాత్మక పెట్టుబడులు అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.