హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(ఎస్ఎస్ఎల్వీ) మూడో, చివరి డెవెలప్మెంటల్ ఫ్లైట్(డీ3) ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం 9.17 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ వాహక నౌక నింగికి దూసుకెళ్లిన కొన్ని నిమిషాల్లోనే భూపరిశీలన ఉపగ్రహాన్ని(ఈవోఎస్-08) వేరు చేసి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇస్రోకు చెందిన యూఆర్రావు శాటిలైట్ సెంటర్లో ఈవోఎస్ను అభివృద్ధి చేశారు. నిఘా, విపత్తులు, మంటలను గుర్తించడం, అగ్నిపర్వతాలను పర్యవేక్షించడం, పర్యావరణ పర్యవేక్షణకు దీనిని వినియోగిస్తారు. స్పేస్ కిడ్జ్ ఇండియా అభివృద్ధి చేసిన ఎస్ఆర్-ఓ డెమొశాట్ అనే మరో చిన్న ఉపగ్రహాన్ని సైతం కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ రెండు ఉపగ్రహాలు కలిపి దాదాపు 175.5 కిలోల బరువు ఉన్నాయి.
ఇస్రో తేలికపాటి వాహకనౌక శ్రేణిలో మొదటి ప్రయోగాన్ని(డీ1) 2022 ఆగస్టులో జరపగా ఆశించిన విజయం దక్కలేదు. దీంతో 2023 ఫిబ్రవరిలో డీ2ను ప్రయోగించగా ఇది విజయవంతమైంది. చివరగా డీ3ని శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. ఇది ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియాకు బలాన్ని ఇచ్చింది. ఇక న్యూస్పేస్ ఇండియా వివిధ దేశాలు, ప్రైవేటు సంస్థలకు చెందిన 500 కేజీల వరకు బరువున్న ఉపగ్రహాలను తేలికపాటి వాహకనౌక(ఎల్వీ) ద్వారా ప్రయోగించగలదు.
ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతంగా జరిపిన ఇస్రో బృందానికి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.