ISRO | బెంగళూరు, నవంబర్ 1: లద్దాఖ్‌లోని లేహ్‌లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తన మొదటి అనలాగ్ స్పేస్ మిషన్‌ను ప్రారంభించింది. శుక్రవారం ఈ మిషన్‌ను విజయవంతంగా ప్రారంభించినట్టు ‘ఎక్స్’లో ఇస్రో ప్రకటించింది. ఆకా స్పేస్ స్టూడియో, యూనివర్సిటీ ఆఫ్ లద్దాఖ్, ఐఐటీ బాంబే, లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సంయుక్తంగా ఈ మిషన్ చేపట్టాయి.
గగన్‌యాన్ పేరుతో అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు ఇస్రో సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సన్నాహకంగా ఈ అనలాగ్ స్పేస్ మిషన్ ఉపయోగపడుతుంది. భూమి అవతల వాతావరణ పరిస్థితులు, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాలను వ్యోమగాములకు ఇక్కడ శిక్షణను ఇవ్వనున్నారు. సముద్ర మట్టానికి చాలా ఎత్తున ఉండే లేహ్‌లో కొంతవరకు చంద్రుడు, అంగారకుడిపై ఉండే వాతావరణ పరిస్థితులు ఉంటాయనే కారణంతో అనలాగ్ మిషన్ కోసం ఇస్రో ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది.