NISAR Mission | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో త్వరలో సరికొత్త మైలురాయిని చేరుకోనున్నది. నాసాకు చెందిన నిసార్ (NISAR) ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపనున్నది. ఈ నెల 30న ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనున్నది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ సైతం ధువ్రీకించారు. ఈ నెల 30న నిసార్ (NASA-ISRO సింథటిక్ అపెర్చర్ రాడార్) మిషన్‌ను ప్రయోగించనున్నట్లు తెలిపారు. జులై 30న సాయంత్రం 5.40 గంటలకు ఏపీలోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు నాసా తెలిపింది. ఈ మిషన్ బడ్జెట్ దాదాపు రూ.12,500 కోట్లు. భారత్‌కు చెందిన ఇస్రో, అమెరికాకు చెందిన నాసా సంస్థలు సంయుక్తంగా మిషన్‌ను చేపడుతున్నది. ప్రయోగం నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అత్యాధునిక టెక్నాలజీతో ఈ శాటిలైట్‌ను రూపొందించారు. దాంతో ప్రయోజనాలు సైతం అదేస్థాయిలో ఉంటాయని ఇస్రో వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రకృతి విపత్తుల నిర్వహణ, భూ వాతావరణంలో మార్పులపై అధ్యయనం, సముద్రాలపై అధ్యయనం చేయడంతో పాటు రక్షణ వ్యవహారాల్లోనూ ఈ ఉపగ్రహం కీలకం కాబోతున్నది. రెండుదేశాలు సంయుక్తంగా కలిసి రూపొందించిన శాటిలైట్‌కు నిసార్గా నామకరణం చేశారు. నాసా, ఇస్రో పేర్లు వచ్చేలా ఈ పేరు పెట్టారు. ఈ శాటిలైట్‌ను ఇస్రోకు చెందిన జీఎస్ఎల్వీ రాకెట్ (GSLV-F18) మోసుకువెళ్లనున్నది. ఉపగ్రహాన్ని భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులో 98.40 డిగ్రీల కోణంలో కక్ష్యలో ప్రవేశపెడుతారు. తొలిసారిగా ఈ శాటిలైట్‌ను సార్ అనే టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇందులో రెండురకాల రాడాలు ఉంటాయి. నాసా ఎల్ బ్యాండ్, ఇస్రో ఎస్-బ్యాండ్ రాడార్లు ఉంటాయి. ఇవి దట్టమైన అడవుల్లో సైతం సమాచారాన్ని సేకరిస్తాయి. భూమి పొరల్లో కదలికలతో పాటు భూమిపై తేమశాతాన్ని కచ్చితత్వంతో అంచనా వేస్తుంది. అలాగే, ఉపరితల నీటి వనరుల మ్యాపింగ్, విప్తత్తు నిర్వహణతో పాటు అనేక కీలకమైన రంగాల్లో సేవలు అందిస్తుందని ఇస్రో తెలిపింది. భూకంపాలు, మంచు పలకలల్లో మార్పులతో భూమిలో స్వల్ప పగుళ్లను ఈ ఉపగ్రహం గుర్తిస్తుంది.
ఎస్ బ్యాండ్ పేలోడ్‌ను ఇస్రో అహ్మదాబాద్‌లోని ల్యాబ్‌లో అభివృద్ధి చేసింది. ఎల్ బ్యాండ్ పేలోడ్‌ను నాసాకు చెందిన జేపీఎల్ అభివృద్ధి చేసింది. రెండింటిని విలీనం చేస్తూ నిసార్ ఉపగ్రహంలో ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికత, రాడార్ వ్యవస్థ సహాయంతో ఖచ్చితత్వంతో ఫొటోలు తీయొచ్చు. భూమి ఉపరితం హై రిజల్యూషన్ చిత్రాలు ప్రతిరోజు 12 తీస్తుంది. రెండురాడార్లు మెష్ రిఫ్లెక్టర్ యాంటెన్నా ద్వారా డేటాను సేకరిస్తాయి. ఉపగ్రహం 242 కిలోమీటర్ల వెడల్పు, అధిక స్పేషియల్ రిజల్యూషన్‌తో భూమిని పరిశీలిస్తుంది. ఈ రెండూ భూమిపై పెరుగుతున్న, తగ్గుతున్న చెట్లు, మొక్కల సంఖ్యను గమనిస్తాయని ఇస్రో తెలిపింది. ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ త్వరలోనే మున్ముందు పెద్ద మిషన్లు చేపట్టనున్నట్లు తెలిపారు. బ్లూబర్డ్ 2 మిషన్ అనే వాణిజ్య ప్రయోగం చేపట్టబోతున్నట్లు తెలిపారు. తొలిసారిగా పీఎల్ఎల్వీ ఎల్-1ని ప్రయోగించబోతున్నట్లు చెప్పారు. దీన్ని ప్రైవేటు పరిశ్రమలు అభివృద్ధి చేస్తున్నాయన్నారు. మోదీ మార్గదర్శక్తవంలో గగన్‌యాన్ మిషన్‌పై పని చేస్తున్నామని.. ఈ ఏడాది జీ-1 రాకెట్‌ను ప్రయోగిఇంచనున్నట్లు తెలిపారు. చంద్రుడిపై మానవయాత్ర గురించి స్పందిస్తూ ప్రధానమంత్రి ఈ ప్రాజెక్టును అధ్యయనం చేయాలని కోరారన్నారు. 2040 నాటికి చంద్రుడిపైకి ఆస్ట్రోనాట్స్‌ను దింపి.. తిరిగి సురక్షితంగా తీసుకురావాలని చెప్పారన్నారు. ఈ విషయంలో పని చేస్తున్నామన్నారు.