శ్రీహరికోట, జనవరి 28 : బుడి బుడి అడుగులతో రోదసి ప్రస్థానం ప్రారంభించిన మన ఇస్రో నేడు ‘రాకెట్’ వేగంతో దూసుకెళుతూ అగ్ర దేశాల సరసన తన స్థానాన్ని సుస్థిరం చేసుకొంటున్నది! ఇందులో భాగంగా చారిత్రక వందో ప్రయోగానికి సర్వ సన్నద్ధమైంది. ఈ ప్రయోగానికి సంబంధించిన 27 గంటల కౌంట్‌డౌన్ మంగళవారం శ్రీహరికోటలో మొదలైంది. బుధవారం ఉదయం 6.23 గంటలకు దేశీయ క్రయోజెనిక్ ఉన్నత శ్రేణి వ్యోమ నౌక జీఎస్ఎల్వీ రాకెట్-15.. ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని రోదసిలోకి తీసుకెళ్లనుంది. భారత నావిగేషన్ వ్యవస్థ నావిక్ సిరీస్‌లోని ఈ రెండో ఉపగ్రహం కచ్చితమైన పొజిషన్, వేగం, టైమింగ్‌తో భారత ఉపఖండం అవతల 1500 కి.మీ పరిధి వరకు యూజర్లకు కచ్చితమైన గమన సూచనలు(నావిగేషన్, ముఖ్యంగా నౌకాయానం) అందిస్తుంది. 50.9 మీటర్ల పొడవైన రాకెట్ జీఎస్ఎల్వీ-ఎఫ్12 మిషన్‌లో ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని గతేడాది మే 29 విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న 2,250 కిలోల బరువైన ఎన్వీఎస్-02 శాటిలైట్‌ను యూఆర్ శాటిలైట్ కేంద్రంలో రూపొందించి అభివృద్ధి పరిచారు. ఇందులో రేజింగ్ పేలోడ్‌కు అదనంగా ఎల్1, ఎల్5 నావిగేషన్ పేలోడ్లు ఉన్నాయి. ఈ ఉపగ్రహం అందించే నావిగేషన్ సమాచారాన్ని గగనతల, భూతల, జల మార్గాల్లో ఉపయోగించుకోవచ్చు. విమానాల నిర్వహణకు, మొబైల్స్‌లో స్థాన ఆధారిత సేవలకు, ఉపగ్రహాల కక్ష్య నిర్ధారణకు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లకు, ఈ ఉపగ్రహపు నావిగేషన్‌ను వాడుకోవచ్చని ఇస్రో తెలిపింది.
భారత్ తన మొదటి పెద్ద ఉపగ్రహాన్ని 1970, ఆగస్టు 10న శ్రీహరికోట నుంచి ప్రయోగించింది. ఇస్రో 99 ప్రయోగాలు చేయడానికి 46 ఏండ్ల సుదీర్ఘ కాలం పట్టింది. ఇప్పటివరకు ఇస్రో సాధించిన ప్రగతి వెనుక పలు తరాల శాస్త్రవేత్తల కృషి ఉన్నదని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం సంచాలకులు రాజరాజన్ మంగళవారం మీడియాకు తెలిపారు.