బెంగళూరు, జనవరి 16: వరుస ప్రయోగాలతో ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి సత్తా చాటింది. నూతన ఏడాదిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పేస్ డాకింగ్ ఎక్స్పర్మెంట్ (స్పేడెక్స్) విజయవంతమైంది. నింగిలో రెండు ఉపగ్రహాల అనుసంధానం విజయవంతంగా పూర్తయింది. ఈ మేరకు ఇస్రో ‘ఎక్స్’లో గురువారం వెల్లడించింది. ‘అంతరిక్ష చరిత్రలో భారత్ తన పేరును లిఖించుకున్నది.
గుడ్‌మార్నింగ్ ఇండియా! ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్ డాకింగ్ విజయవంతమైంది. ఈ అద్భుతమైన క్షణాలకు సాక్ష్యంగా నిలిచినందుకు గర్వంగా ఉంది’ అని ఇస్రో తెలిపింది. పోస్ట్ డాకింగ్, రెండు ఉపగ్రహాలను ఒకే వస్తువుగా నియంత్రించడం కూడా విజయవంతమైందని ఇస్రో వెల్లడించింది. అన్‌డాకింగ్, పవర్ ట్రాన్స్ఫర్ చెక్ చేయడం లాంటి కార్యక్రమాలను రానున్న రోజుల్లో చేపట్టనున్నట్టు ఇస్రో వెల్లడించింది.
స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమవడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఉపగ్రహాల డాకింగ్ సామర్థ్యం కలిగిన నాలుగో దేశంగా మన దేశం అవతరించింది. నింగిలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేసిన భారత్.. అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన సగర్వంగా చేరింది.
గతేడాది డిసెంబర్ 30న స్పేడెక్స్ మిషన్‌ను ఇస్రో చేపట్టిన విషయం విదితమే. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ ద్వారా ఎస్‌డీఎక్స్01 (ఛేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్) అనే రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ఒక్కొక్కటి 220 కిలోల బరువుండే ఆ శాటిలైట్లతో పాటు 24 పేలోడ్లను కూడా పీఎస్ఎల్వీ తీసుకెళ్లింది.
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ రాకెట్ 15 నిమిషాల తర్వాత వాటిని 475 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆ తర్వాత జనవరి 7, 9, 11 తేదీల్లో డాకింగ్ ప్రక్రియ చేపట్టాలని ఇస్రో అనుకున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించిన తర్వాత గురువారం రెండు ఉపగ్రహాల అనుసంధానాన్ని ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది.
అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేయడం ద్వారా భారత్ అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్రాత్మక మైలురాయికి చేరుకుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఇస్రోను, శాస్త్రవేత్తలను ఆమె అభినందించారు. ‘భారత్ చేపట్టబోయే చంద్రయాన్-4, స్వదేశీ స్పేస్ స్టేషన్, గగన్‌యాన్ లాంటి ప్రయోగాలకు ఇది మార్గం సుగమం చేసింది’ అని రాష్ట్రపతి ముర్ము తెలిపారు.
స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బందిని ఆయన అభినందించారు. ‘రెండు ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బందికి అభినందనలు. రానున్న సంవత్సరాల్లో భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే అంతరిక్ష ప్రయోగాలకు ఇది కీలకమెట్టు’ అని మోదీ తెలిపారు.