బెంగళూరు: అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ సామర్థ్యాన్ని అందుకునేందుకు ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ ప్రయోగంలో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. ట్రయల్‌లో భాగంగా స్పేడెక్స్ ఉపగ్రహాలైన ఎస్‌డీఎక్స్01(చేజర్), ఎస్‌డీఎక్స్02(టార్గెట్) ఉపగ్రహాలను మొదట 15 మీటర్ల చేరువకు, ఆ తర్వాత 3 మీటర్ల అతి సమీపానికి విజయవంతంగా తీసుకువచ్చినట్టు భారత అంతరిక్ష పరిశోధక సంస్థ ఆదివారం ప్రకటించింది.
ఆ తర్వాత మళ్లీ ఉపగ్రహాలను సురక్షిత దూరానికి పంపించినట్టు తెలిపింది. ఈ డాటాను విశ్లేషించిన తర్వాత డాకింగ్(రెండు ఉపగ్రహాల అనుసంధానం) ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించింది. కాగా, డిసెంబర్ 30న ఇస్రో స్పేడెక్స్ ప్రయోగం ప్రారంభించిన సంగతి తెలిసిందే. పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది.