శ్రీహరికోట/బెంగళూరు, అక్టోబర్ 23: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రపంచానికి మరోసారి తన సత్తా చాటింది. అత్యంత బరువైన లాంచ్ వెహికల్ మార్క్(ఎల్వీఎం)3-ఎం2 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా ప్రైవేటు కమ్యూనికేషన్స్ సంస్థ ‘వన్‌వెబ్’కి చెందిన 36 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం అర్ధరాత్రి 12.07 గంటలకు ఎల్వీఎం3-ఎం2 నిప్పులుగక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం ఉపగ్రహాలను విజయవంతంగా లోయర్ ఎర్త్ ఆర్బిట్(ఎల్ఈవో)లో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌కు కీలకమైనది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన తొలి వాణిజ్యపరమైన ప్రాజెక్టు ఇది. యూకేకు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ (వన్‌వెబ్ లిమిటెడ్)తో న్యూస్పేస్ ఇండియా చేసుకొన్న ఒప్పదంలో భాగంగా తాజా ప్రయోగం చేపట్టినట్టు ఇస్రో పేర్కొన్నది.
ఎల్వీఎం3-ఎం2గా పేరు మార్పు
ఇన్నేండ్లు జీఎస్ఎల్వీ-ఎంకే3గా పిలిచిన రాకెట్‌కు ఎల్వీఎం3-ఎం2గా పేరు మార్చారు. ఈ రాకెట్ 4 వేల కిలోల బరువుండే శాటిలైట్లను జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(జీటీవో), 8 వేల కిలోల బరువును లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి మోసుకెళ్లగలిగేలా ఆధునీకరించారు. ఎల్వీఎం3-ఎం2 ప్రయోగం సక్సెస్ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తాయి. అటు.. చంద్రయాన్-3 నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చిందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆదివారం తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌లో ప్రయోగించే అవకాశం ఉందని వెల్లడించారు. తమిళనాడులో రాకెట్ లాంచింగ్ స్టేషన్ కోసం స్థలాన్ని కొనుగోలు చేశామని తెలిపారు.
అంతర్జాతీయ వాణిజ్య శాటిలైట్ మార్కెట్‌పై కన్ను
ఎల్వీఎం-3 ప్రయోగం సక్సెస్ నేపథ్యంలో ఇస్రో వాణిజ్యపరంగా తన శాటిలైట్ లాంచ్ మార్కెట్‌ను విస్తృతం చేసుకోవాలని భావిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లో మేజర్ షేర్‌ను దక్కించుకొనే యోచనలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరో 36 వన్‌వెబ్ శాటిలైట్లను ఎల్వీఎం3 ద్వారా వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రయోగించనున్నట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఇండియన్ స్పేస్ అసోసియేషన్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇటీవలి నివేదిక ప్రకారం గ్లోబల్ స్పేస్ ఎకానమీ 447 బిలియన్ డాలర్లుగా ఉన్నది. అందులో ఉప గ్రహ ప్రయోగ విభాగానిది 6 బిలియన్ డాలర్లు. పీఎస్ఎల్వీతో ఉపగ్రహ ప్రయోగంలో ఇస్రో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకొన్నది. దీని ద్వారా కోట్ల డాలర్ల ఆదాయం వస్తున్నది.
ఎల్వీఎం3-ఎం2 విశేషాలు