బెంగళూరు, ఆగస్టు 22: చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరిన వేళ.. భవిష్యత్తులో మరో చంద్రయాన్ యాత్రపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక ప్రకటన చేసింది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)తో కలిసి త్వరలో చంద్రుడిపైకి రోవర్‌ను పంపనున్నట్టు వెల్లడించింది. ఇందులో భారత్, జపాన్‌తోపాటు అమెరికా, యూరోపియన్ ఏజెన్సీకి చెందిన పరిశోధన పరికరాలు కూడా చందమామపైకి తీసుకుపోనున్నట్టు పేర్కొన్నది. లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ (లుపెక్స్) పేరుతో చేపట్టనున్న ఈ యాత్ర ద్వారా చంద్రుడి ధ్రువాల వద్ద నీటి ఆవిరి, అక్కడి ధూళిలో విద్యుదయస్కాంత పరిమాణాన్ని ఒడిసిపట్టనున్నట్టు ఇస్రో మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం ఇస్రో, జాక్సా కలిసి ఓ రోవర్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. జపాన్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ క్యాబినెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సకు సునెటా ఇటీవల బెంగళూరులోని ఇస్రో కార్యాలయాన్ని సందర్శించి ఇస్రో చైర్మన్ ఎస్ సోమ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లుపెక్స్పై చర్చలు జరిగాయని ఇస్రో తెలిపింది.