న్యూఢిల్లీ : చంద్రయాన్-3 (Chandrayaan-3) మరికాసేపట్లో చంద్రుడి ఉపరితలంలో అడుగుపెడుతున్న క్రమంలో ఇస్రో వ్యవస్ధాపకులు విక్రం సారాభాయ్ కుమారుడు కార్తికేయ సారాభాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాబిల్లి ఉపరితలంలో చంద్రయాన్-3 కాలుమోపడం మానవాళి గర్వించదగిన విషయమని అన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఇంతవరకూ ఏ ఒక్కరూ చేరుకోలేదని పేర్కొన్నారు.
చంద్రయాన్-3 మిషన్ ప్రజల్లో ఆత్మస్ధైర్యం నింపుతుందని అన్నారు. భారత అంతరిక్ష రంగం, ఇస్రోలో తన తండ్రి హయాం అనంతరం భారీ మార్పులు చోటుచేసుకున్నాయని అహ్మదాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్తికేయ సారాభాయ్ చెప్పుకొచ్చారు. తన తండ్రి అంతరిక్ష రంగంలో చేపట్టిన పరిశోధనలు, వినూత్న మిషన్లను తాను చిన్ననాటి నుంచి పరిశీలించేవాడినని అన్నారు.
భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడిగా పరిగణించే విక్రం సారాభాయ్ ఇస్రో వ్యవస్ధాపకుడిగా పేరొందారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి అంతరిక్ష కార్యక్రమం అత్యవసరమని ఆయన ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు. ఇక చంద్రయాన్-3 బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో కాలుమోపనుంది. మూన్ మిషన్ సేఫ్ ల్యాండింగ్‌పై దేశం యావత్తూ ఉత్కంఠగా వేచిచూస్తోంది.
Read More :