ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ముందడుగేసింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) మూడో దశ (SS3) ను విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) లోని సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్ కేంద్రంలో మంగళవారం ఈ ప్రయోగం నిర్వహించింది. మూడు-దశల ఆల్-సాలిడ్ లాంచ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వీ పనితీరును విశ్లేషించడంతోపాటు డేటాను సేకరించినట్లు ఇస్రో వెల్లడించింది.
అంతరిక్షంలోకి చిన్న ఉపగ్రహాలను వేగంగా ప్రయోగించడం కోసం దీనిని రూపొందించారు. అధిక స్థాయిలో ఉత్పత్తికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. పేలోడ్‌కు సెకనుకు 4 కిలోమీటర్ల వేగాన్ని అందించడంలో ఎస్ఎస్-3 కీలకపాత్ర పోషిస్తుందని అధికారులు వెల్లడించారు. పేలోడ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. ప్రస్తుతం చేసిన అప్గ్రేడ్లు ఈ దశలో మెరుగైన ఇగ్నైటర్, నాజిల్ డిజైన్ ఉపగ్రహాల సామర్థ్యం, నిర్మాణాత్మక దృఢత్వాన్ని పెంచినట్లు తెలిపారు.
ఈ పరీక్షలో ఒత్తిడి, థ్రస్ట్, ఉష్ణోగ్రత, వైబ్రేషన్, యాక్యుయేటర్ పనితీరు వంటి విషయాలను పరిశీలించినట్లు సైంటిస్టులు వెల్లడించారు.