బెంగళూరు, మే 10: అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో ఘనత సాధించింది. అధునాతన అడిటీవ్ మ్యానుఫ్యాక్చరింగ్(ఏఎం) సాంకేతికతతో పీఎస్4 లిక్విడ్ రాకెట్ ఇంజిన్‌ను తయారు చేసి ఈ నెల 9న విజయవంతంగా పరీక్షించింది. దీనిని 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ అని కూడా అంటారు. సాధారణంగా ఇంజిన్ అంటే అనేక భాగాలను ఒకచోట అమర్చి, వెల్డింగ్ చేసి తయారుచేస్తారు. కానీ, ఈ ఇంజిన్ మొత్తం ఒకే భాగంగా తయారుచేశారు.
ఈ సాంకేతికతను వాడటం వల్ల ఇంజిన్ తయారీకి 97 శాతం ముడి పదార్థాలు, 60 శాతం ఉత్పత్తి సమయం ఆదా అయ్యిందని ఇస్రో ప్రకటించింది. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం 13.7 కిలోల మెటల్ పౌడర్‌తో రాకెట్ తయారీ పూర్తయ్యిందని వెల్లడించింది. ఈ ఇంజిన్‌ను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(పీఎస్ఎల్వీ)లో ఎగువ దశలో వినియోగిస్తారు.