Israel Hezbollah War | బీరుట్: ఇజ్రాయెల్-హెజ్బొల్లా పరస్పర దాడులు బుధవారం మరింత ఉద్ధృతంగా మారాయి. హెజ్బొల్లా ఉగ్రవాదులు డజన్ల కొద్దీ రాకెట్లను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించారు. టెల్ అవీవ్ సమీపంలోని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయంపైకి బాలిస్టిక్ క్షిపణినిని ప్రయోగించామని హెజ్బొల్లా ప్రకటించింది. దీనిని అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.
హెజ్బొల్లా ప్రయోగించిన వందలాది ప్రొజక్టైల్స్ వల్ల ఇజ్రాయెల్‌లోని అనేక భవనాలు, ఇండ్లు ధ్వంసమైనట్లు, అనేక మంది ప్రజలు గాయపడినట్లు తెలుస్తున్నది. ఇజ్రాయెల్ బుధవారం జరిపిన దాడుల్లో 51 మంది మరణించారని, 223 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రి తెలిపారు. తాత్కాలిక శిబిరాల్లో 27 వేల మందికి ఆశ్రయం కల్పించినట్లు లెబనాన్ అధికారులు చెప్పారు.
హెజ్బొల్లా రాకెట్-మిస్సైల్ విభాగాధిపతి కమాండర్ ఇబ్రహీం ఖబాయిసి ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించాడు. ఇబ్రహీంతోపాటు ఇద్దరు హెజ్బొల్లా హై ర్యాంక్ కమాండర్లు మరణించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఐదు రోజుల నుంచి నిర్వహిస్తున్న దాడుల వల్ల 90 వేల మందికిపైగా ప్రజలు నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఏడాదిలో సుమారు 2 లక్షల మంది నిర్వాసితులయ్యారని చెప్పింది.
హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థతో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో రిజర్వు దళాలను సమాయత్తం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దీంతో లెబనాన్‌పై మరింత భీకరంగా ఇజ్రాయెల్ దాడి చేయబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.