న్యూఢిల్లీ, ఏప్రిల్ 13 : అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన దరిమిలా ఇరాన్‌పై మళ్లీ యుద్ధానికి ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) సిద్ధమవుతున్నట్లు మూడు ప్రధాన హిబ్రూ టీవీలు సోమవారం వెల్లడించాయి. ఈ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా ఇజ్రాయెల్ రక్షణ అధికారులు లీక్ చేసినట్లు తెలుస్తున్నది. రెండు వారాల కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన వారం లోపలే ఈ పరిణామం చోటుచేసుకుంటున్నది. పశ్చిమాసియాలో యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు ఉద్దేశించి పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో ఇస్లామాబాద్‌లో 21 గంటలపాటు జరిగిన శాంతి చర్చలు విఫలమైన తర్వాత 48 గంటల్లోనే మళ్లీ ఇరాన్‌తో తలపడేందుకు ఐడీఎఫ్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
ఇరాన్‌తో మళ్లీ యుద్ధాన్ని పునరుద్ధరించేందుకు సన్నాహాలు చేపట్టాలని ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎయాల్ జమీర్ సైన్యాన్ని ఆదేశించినట్లు వైనెట్ న్యూస్ సైట్ ఆదివారం పేర్కొన్నది. ఇరాన్ నుంచి కూడా ఆకస్మిక దాడులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లు సంసిద్ధంగా ఉండాలని కూడా జమీర్ సైన్యాన్ని ఆదేశించినట్లు చానెల్ న్యూస్ వెల్లడించింది. ఇలా ఉండగా హొర్ముజ్ జలసంధి దిగ్బంధంతోపాటు ఇరాన్‌పై పరిమిత సైనిక దాడులు పునరుద్ధరించే విషయాన్ని తన సలహాదారులు పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్ధాల పట్ల అసంతృప్తిగా ఉన్న ట్రంప్ ఇరాన్‌పై పూర్తి స్థాయి యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే అవకాశం చాలా తక్కువని అమెరికన్ అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఆదివారం పేర్కొన్నది.