Israel-Hamas War | ఇజ్రాయెల్ – హమాస్ మధ్య అనధికారిక యుద్ధం కొనసాగుతున్నది. అయితే, రెండు ప్రాంతాల్లో పలువురు భారతీయులు చిక్కుకుపోయారు. పాలస్తీనా, ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన 27 మంది భారతీయులను విదేశాంగ మంత్రిత్వ శాఖ రక్షించినట్లు మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా తెలిపారు. భారతీయులను ఈజిప్ట్‌కు తరలించారని, అక్కడి నుంచి స్వదేశం తరలించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరో వైపు హమాస్ బాంబుల దాడిలో ఇజ్రాయెల్‌లో నేపాల్‌కు చెందిన పది మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లోని నేపాల్ ఎంబసీ అధికారి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడి చేసేందుకు హమాస్ భారీగా రాకెట్లను సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. అయితే, ఇప్పటికే ఒకేసారి దాదాపు 5వేలకుపైగా రాకెట్లను ప్రయోగించింది. అయితే, హమాస్ ఉగ్రవాదులకు ఎక్కడి నుంచి ఈ రాకెట్లు వచ్చాయి ? హమాస్ ఇంత మొత్తంలో రాకెట్ టెక్నాలజీని ఎవరు అందించారనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇనుప గొట్టాలు, నీటి పైపులు, ఇజ్రాయెల్ క్షిపణుల శకలాలను ఉపయోగించి షార్ట్ రేంజ్ రాకెట్లను సిద్ధం చేసినట్లు తెలుస్తుండగా.. ఈ క్షిపణులను తయారు చేయడంలో ఇరాన్ సహకారం చేసిందని ఆరోపణలున్నాయి.
మరో వైపు ఇజ్రాయెల్ భద్రతా మంత్రి మండలి ‘స్టేట్ ఆఫ్ వార్’ ఆమోదించింది.. ఆర్టికల్ 40 ప్రకారం సైనిక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇజ్రాయెల్‌కు భారత్ నుంచి మద్దతు అందుతుందని.. పలువురు మంత్రులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఫోన్లో మాట్లాడారని ఇజ్రాయెల్ అంబాసిడర్ నౌర్ గిల్లాన్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు నైతిక, రాజకీయ మద్దతు మాత్రమే అవసరమన్నారు. భూమిపై ఎలా పని చేయాలో తమకు తెలుసునన్నారు. హమాస్ ఇకపై ఎవరికీ బెదిరించని విధంగా చర్యలు ఉండబోతున్నాయన్నారు. హమాస్ దాడిలో ఇజ్రాయెల్‌లో ఇతరదేశాలకు చెందిన పౌరులు చాలా మంది మరణించారని, అయితే దీనిపై ఖచ్చితమైన సమాచారం లేదన్నారు.