Supreme Court | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపరాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇది ప్రమాదకర బుజ్జగింపు ధోరణికి దారితీసే ప్రమాదం ఉన్నదని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ కోటా రిజర్వేషన్లను ఉపవర్గీకరించే అధికారం రాష్ర్టాలకు లేదన్న 2004నాటి సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అత్యంత వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ ప్రయోజనాలను అందజేస్తున్నప్పుడు రాష్ట్రం ఇతరులను మినహాయించలేదని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది.
ఉదాహరణకు వెనుకబడిన తరగతులు అధికంగా ఉన్నట్టయితే, రాష్ట్రం కేవలం రెండింటిని మాత్రమే ఎంచుకోగలదా? అని ప్రశ్నిస్తూ.. రిజర్వేషన్ల ప్రయోజనాల నుంచి మినహాయించబడిన వారు ఆర్టికల్ 14 ప్రకారం వారి వర్గీకరణను ఎప్పుడైనా సవాల్ చేయవచ్చు అని తెలిపింది. వెనుకబాటు తనం ఏ మేరకు ఉన్నదో చూసి కులాన్ని వర్గీకరించవచ్చని చెప్పింది. అత్యంత వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నట్టు చెప్పింది. కానీ అత్యంత వెనుకబడిన వారికి ప్రయోజనాలు కల్పిస్తున్నప్పుడు ఇతరులను మినహాయించలేరని, ఇది అత్యంత ప్రమాదకరమని ధర్మాసనం పేర్కొంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కులాలను ఎంచుకుంటే మరికొన్ని రాష్ర్టాలు మరికొన్ని కులాలను ఎంపిక చేస్తాయి.. అసలు ఈ ఆలోచన ప్రజాదరణ రాజకీయాల కోసమా? మేమే ప్రమాణాలను నిర్దేశించడం ద్వారా దీన్ని సరిదిద్దుతామని ధర్మాసనం పేర్కొన్నది. కేంద్రం, రాష్ర్టాలు, తదితరుల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. రిజర్వేషన్లు కల్పించటం, సామాజిక వెనుకబాటు తనాన్ని తొలగించటం, ఆ పని చేస్తూనే సామాజికంగా ఎదుర్కొంటున్న అసమానతలను తొలగించడం రాష్ట్రం పాత్ర అని ధర్మాసనం తెలిపింది.