న్యూఢిల్లీ: బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) పన్నుల అక్రమాలకు పాల్పడినట్లు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఆరోపించింది. నిర్ధిష్ట లావాదేవీల్లో కొన్ని పన్నులు చెల్లించలేనట్లు తనిఖీల్లో గుర్తించినట్లు తెలిపింది. కొన్ని విదేశీ చెల్లింపుల్లో భారత్లోని ఆదాయంగా పేర్కొనలేదని ఆరోపించింది. లావాదేవీలకు సంబంధించిన అనేక అవకతవకలను తమ సర్వేలో గుర్తించినట్లు తెలిపింది. బహుళజాతి సంస్థకు చెందిన ఒక విభాగం నుంచి మరో విభాగానికి జరిగిన చెల్లింపుల్లో జీఎస్టీ, మేధో సంపత్తి పరంగా ఈ అక్రమాలు జరిగినట్లు వెల్లడించింది. ఇంగ్లీష్ కాకుండా వివిధ భారతీయ భాషలలో గణనీయమైన కంటెంట్ వినియోగం ఉన్నప్పటికీ, చూపించిన ఆదాయంలో వ్యత్యాసాలు ఉన్నట్లు సర్వేలో గుర్తించినట్లు తెలిపింది.
కాగా, ట్యాక్స్ అక్రమాలకు సంబంధించిన పలు ఆధారాలు తమకు లభించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. డిజిటల్ ఫైళ్లు, ఇతర ప్రతాల పరిశీలనతో పాటు ఉద్యోగుల నుంచి వివరాల సేకరణ ఇంకా కొనసాగుతున్నదని తెలిపింది. తమ దర్యాప్తును ఆలస్యం చేసేందుకు బీబీసీ సిబ్బంది వ్యూహాత్మక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది. అయినప్పటికీ బీబీసీ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా సర్వే చేస్తున్నట్లు పేర్కొంది. ఐటీ శాఖ ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రధాని మోదీపై రెండు భాగాల డాక్యుమెంటరీని బీబీసీ ఇటీవల ప్రచారం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధించినప్పటికీ పలు విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా స్కీనింగ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో మూడు రోజులుగా ఐటీ శాఖ తనిఖీలు చేసింది.
రాత్రి వేళ కూడా సోదాలు చేయడంతోపాటు బీబీసీ సిబ్బందిని ప్రశ్నించింది. కొందరు ఉద్యోగుల ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు కూడా తనిఖీ చేసింది. తనిఖీ సమయంలో ఎలాంటి డేటా డీలీట్ చేయవద్దని, దీని గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేయవద్దని బీబీసీ సిబ్బందిని ఆదేశించింది. మరోవైపు ఐటీ శాఖ ఆరోపణలపై బీబీసీ ఇంకా స్పందించలేదు.
అయితే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించడం వల్లనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహించి ఆ సంస్థ కార్యాలయాల్లో ఐటీ శాఖ ద్వారా తనిఖీలు చేయిస్తున్నదని ప్రతిపక్షాలతోపాలు పలు వర్గాలు విమర్శిస్తున్నాయి.