బెంగళూరు, నవంబర్ 18: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే పోషకాహారం పంపిణీలో అక్రమాలు చోటుచేసుకొన్నాయన్న ఆరోపణలపై కర్ణాటక మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు నమోదైంది. బెంగళూరుకు చెందిన నటరాజ శర్మ అనే న్యాయవాది ఈ ఫిర్యాదు చేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖలో రూ.600 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపించారు. టెండర్లలో అక్రమాలు చోటుచేసుకొన్నాయని, అనర్హులకు కాంట్రాక్టులు ఇచ్చారన్నారు.
అక్రమాల్లో మంత్రి హెబ్బాళ్కర్ పాత్ర ఉన్నదని, బ్లాక్ లిస్టెడ్ క్రిస్టీ ఫ్రైడ్ గ్రామ్ కంపెనీకి టెండర్లు ఇచ్చారని ఆరోపించారు. కాంట్రాక్టర్లు సరఫరా చేసిన ఆహార నాణ్యత నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేదని లోకాయుక్త దృష్టికి తీసుకొచ్చారు. ఆహార సరఫరా బాధ్యతను స్థానిక సేవా సంస్థలకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించినా.. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ, బ్లాక్‌లిస్టెడ్ కంపెనీకి టెండర్ ఇచ్చారని న్యాయవాది నటరాజ శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్, మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి జేసీ ప్రకాశ్, డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.