కోల్‌కతా: ఇరాక్ నుంచి చైనాకు వెళ్తున్న ఇరాకీ యువతి విమానంలో కుప్పకూలింది. ఆ విమానం భారత్‌లో అత్యవసరంగా ల్యాండ్ కాగానే ఆ అమ్మాయి మరణించింది. (Iraqi Teen Collapses In Plane) ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫార్మాల్టీల తర్వాత ఆ యువతి మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగిస్తామని వెల్లడించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల యువతి బుధవారం రాత్రి తన కుటుంబంతో కలిసి చైనాలోని గ్వాంగ్జౌకు విమానంలో బయలుదేరింది. ఇరాకీ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణించిన ఆమె ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. దీంతో ఆ విమానాన్ని దారి మళ్లించారు. బుధవారం రాత్రి 10.18 గంటలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు.
కాగా, ఎయిర్‌పోర్ట్‌లోని మెడికల్ సిబ్బంది వెంటనే ఇరాకీ యువతిని పరిశీలించారు. ఆమె మరణించిందని గ్రహించారు. వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా ఆ యువతి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని ఇరాక్ రాయబార కార్యాలయానికి ఈ సమాచారం అందించారు.
మరోవైపు లాంఛనాలు పూర్తైన తర్వాత ఇరాకీ బాలిక మృతదేహాన్ని వారి కుటుంబానికి అప్పగిస్తామని పోలీసులు చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాకీ విమానం మిగిలిన ప్రయాణికులతో గురువారం తెల్లవారుజామున 1.49 గంటలకు గమ్యస్థానానికి బయలుదేరిందని ఎయిర్పోర్ట్ అధికారులు శుక్రవారం వెల్లడించారు.