ఇస్లామాబాద్: ఇరాన్-అమెరికా మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. శనివారం పాక్ ప్రధాని షరీఫ్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ, ఆయన ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ నుండి స్వదేశానికి బయలు దేరడమే కారణం. కొద్దిసేపటికి తమ దేశ ప్రతినిధులు చర్చల కోసం ఇరాన్‌కు రావడం లేదని ట్రంప్ ప్రకటించారు. సుదూర ప్రాంతంలో జరిగే చర్చలు నిష్ఫలమని భావించడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
దీంతో అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన రెండో విడత చర్చలపై అనిశ్చితి మరింతగా పెరిగింది. మరోవైపు ఇరాన్-పాక్ మంత్రుల మధ్య సమావేశం దృశ్యాలను చూపే వీడియోను పాక్ ప్రధాని కార్యాలయం ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్, సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ కూడా పాల్గొన్నారు. అయితే సమావేశంలో చర్చించిన అంశాలపై స్పష్టత లేదు. ప్రాంతీయ పరిస్థితిపై చర్చలకు సంబంధించిన అస్పష్టమైన ప్రస్తావన మాత్రమే ఉంది. ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితిపై మేము ఆత్మీయంగా, స్నేహపూర్వకంగా అభిప్రాయాలను పంచుకున్నాము. పరస్పర ఆసక్తి ఉన్న విషయాలపై కూడా చర్చంచుకున్నాము అని సమావేశం అనంతరం పాక్ ప్రధాని అమెరికాతో చర్చలను నేరుగా ప్రస్తావించకుండా అన్నారు.